USA: శ్రీలంక మృతుల విషయంలో తప్పులో కాలేసిన ట్రంప్
- 138 మిలియన్ల మంది చనిపోయారంటూ ట్వీట్
- ఆ తర్వాత తప్పు దిద్దుకున్న వైనం
- సాయ పడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటన
శ్రీలంకలో ఇవాళ జరిగిన ఘోరకలి యావత్ ప్రపంచాన్ని నిశ్చేష్టకు గురిచేసింది. ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిల్లో ప్రార్థనలు చేసుకుంటున్న క్రైస్తవులపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడడం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పులో కాలేశారు. మొదట తన ట్వీట్ లో మృతుల సంఖ్యలను 138 మిలియన్లుగా పేర్కొన్నారు.
అయితే, అందులో తప్పు సంఖ్య ఉండడంతో ఆ ట్వీట్ తొలగించి వెంటనే మరో ట్వీట్ లో 138 మంది చనిపోయారంటూ సవరణ చేశారు. కొలంబోలో చర్చిలు, హోటళ్లపై జరిగిన ఉగ్రదాడి బాధితులకు ట్రంప్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ ఆపద సమయంలో శ్రీలంకకు అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు.