Jana Sena: జనసేన చెప్పే మార్పు మొదలైంది, కొనసాగిద్దాం: పవన్ కల్యాణ్
- మార్పు ఎప్పుడూ చిన్నగానే మొదలవుతుంది
- ఈ మార్పు ఎంత వరకు వెళ్తుందో తెలియదు
- ఎన్నికలు లేని సమయంలోనూ ప్రజలతో మమేకం కావాలి
జనసేన పార్టీ చెప్పే ‘మార్పు’ మొదలైందని, దాన్ని కొనసాగిద్దామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తమ అభ్యర్థులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఈ సమావేశంలో ఓటింగ్ సరళి గురించి మాత్రమే పార్టీ నాయకులను అడిగానని అన్నారు. మార్పు ఎప్పుడూ చిన్నగానే మొదలవుతుందని, పార్టీ ఎదిగే దశలో ఈ మార్పు ఎంత వరకు వెళ్తుందో తెలియదని అన్నారు. ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రజలతో పార్టీ శ్రేణులు మమేకం కావాలని పిలుపు నిచ్చారు.
ప్రజాసమస్యల పరిష్కారం దిశగా పని చేయాలని, సమస్య పెద్దదైతే తాను కూడా స్పందిస్తానని చెప్పారు. గ్రామస్థాయిలో సమస్యల పట్టిక సిద్ధం చేయాలని సూచించారు. భయం, అభద్రతా భావాన్ని దాటుకుని వచ్చిన యువశక్తి ఇదని, గ్రామ స్థాయి నుంచి కొత్త తరం నేతలను తయారు చేయాలని పిలుపు నిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే మార్పును ప్రజల్లోకి తీసుకెళదామని, తెలంగాణలోనూ ఇదే తరహా మార్పును ప్రజలు ఆహ్వానిస్తున్నారని అన్నారు.