Narendra Modi: మోదీని దొంగ అని విమర్శిస్తే.. దాన్ని బీసీలకు ఆపాదించడం రాజకీయ దిగజారుడుతనం కాదా?: కళా వెంకట్రావు
- కులాన్ని వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధం
- ఏపీలో రూ.16 వేల కోట్లను కేటాయించాం
- చట్ట సభల్లో ఎందుకు ఆమోదించలేదు?
ఆర్థిక నేరస్థులకు కాపలా కాస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని దొంగ అని విమర్శిస్తే దానిని బీసీలకు ఆపాదించడం రాజకీయ దిగజారుడుతనం కాదా? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. నేడు ఆయన మోదీకి బహిరంగ లేఖ రాశారు. 70 కోట్ల మంది బీసీలకు బడ్జెట్‌లో కేవలం రూ. 7,750 కోట్లు మాత్రమే కేటాయించిన మోదీ కులాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
బీసీలకు చేసిన ఒక్క మంచి పనినైనా వివరించగలరా? అంటూ నిలదీశారు. ఏపీలో రూ.16 వేల కోట్లను 2.5 కోట్ల మంది బీసీల కోసం కేటాయించామన్నారు. అధికారం కోసం కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే మోదీ చర్యలను చూసి దేశం సిగ్గుతో తలదించుకుంటోందని లేఖలో తీవ్రంగా విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్ల తీర్మానాలను చట్ట సభల్లో ఎందుకు ఆమోదించలేదని కళా వెంకట్రావు ప్రశ్నించారు.