Andhra Pradesh: పోలవరం కెపాసిటీ పెంచితే భద్రాచలం వద్ద అసాధారణ పరిస్థితి: అధ్యయన కమిటీ హెచ్చరిక
- నివేదిక రూపొందిస్తున్న అధ్యయన బృందం
- బ్యాక్ వాటర్స్ పరిధి పెరుగుతుంది
- ముంపు తీవ్రత అధికమవుతుంది
గోదావరి నదిపై పోలవరం వద్ద నిర్మిస్తున్న భారీ ప్రాజక్టును ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జాతీయ ప్రాజక్టులో నిల్వసామర్థ్యాన్ని 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ సర్కారు నిర్ణయించుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో అభ్యంతరాలు పెడుతోంది. సీడబ్ల్యూసీ సూచనలకు అనుగుణంగా పోలవరం నమూనాలో మార్పులు చేర్పులు చేయడంతో, టి-సర్కారు సుప్రీంను ఆశ్రయించింది. పోలవరం స్టోరేజి కెపాసిటీ పెంచితే భద్రాచలం మునిగిపోతుందన్నది వారి ఆందోళన.
దీనిపై నీటిపారుదల శాఖ అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈ నరసింహారావు, ఈఈ రాంప్రసాద్, ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ శశిధర్ లతో కూడిన అధ్యయన బృందం పోలవరం ముంపు ప్రాంతాల స్థితిగతులపై నివేదిక రూపొందిస్తోంది. ఈ క్రమంలో సీఈ నరసింహారావు మీడియాకు పలు విషయాలు వెల్లడించారు.
తొలుత ప్రతిపాదించినట్టుగా 36 లక్షల క్యూసెక్కుల స్టోరేజి కారణంగా భద్రాచలంలో 43 అడుగుల మేర నీటిమట్టం వస్తుందని, అదే, 50 లక్షల క్యూసెక్కుల నీటి నిల్వతో భద్రాచలం వద్ద అసాధారణ పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల వరకు వరద పోటెత్తుతుందని హెచ్చరించారు. దాదాపు 120 కిలోమీటర్ల పరిధిలో పోలవరం బ్యాక్ వాటర్స్ వ్యాపిస్తాయని నరసింహారావు వివరించారు. 1986లో వచ్చినట్టుగా గోదావరికి భారీ వరద వస్తే మాత్రం పరీవాహక ప్రాంతం అంతా చిన్నాభిన్నం అవుతుందని తెలిపారు.
ఓవైపు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జులై కల్లా పూర్తి గ్రావిటీతో పోలవరం నుంచి నీళ్లు ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. మరి, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాల నేపథ్యంలో సుప్రీం ఏం చెబుతుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.