Prabhas: ప్రభాస్ 'మిస్టర్ పర్ఫెక్ట్' కథ కాపీయే... నిర్ధారించిన న్యాయస్థానం!
- రచయిత్రి శ్యామలాదేవికి ఊరట
- సుదీర్ఘ పోరాటం చేసిన శ్యామలాదేవి
- 'నా మనసు కోరింది నిన్నే' నవల కాపీ కొట్టారని తేల్చిన కోర్టు!
కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన 'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రం గణనీయమైన స్థాయిలో విజయాన్ని దక్కించుకుంది. అయితే ఆ సినిమా కథ తనదేనంటూ రచయిత్రి శ్యామలాదేవి కోర్టును ఆశ్రయించారు. తాను రచించిన 'నా మనసు కోరింది నిన్నే' నవలను కాపీ కొట్టి 'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రం రూపొందించారంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై అప్పట్లో న్యాయస్థానం ఆదేశాల మేరకు హైదరాబాద్, మాదాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజుకు సమన్లు కూడా పంపారు.
అప్పటినుంచి కోర్టు పరిధిలో ఉన్న ఈ వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. 'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రం 'నా మనసు కోరింది నిన్నే' నవలకు కాపీయేనని హైదరాబాద్ సివిల్ కోర్టు ఓ నిర్ణయానికి వచ్చింది. దీనిపై శ్యామలాదేవి మీడియాతో మాట్లాడుతూ, 'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రంలోని ప్రతి పాత్ర తన నవల నుంచి కాపీ కొట్టిందేనని స్పష్టం చేశారు. అప్పట్లో ఈ విషయం దిల్ రాజుతో మాట్లాడాలని ప్రయత్నించినా ఆయన కలిసేందుకు సుముఖత చూపలేదని అన్నారు. అయితే, కోర్టు తీర్పు విషయంలో పూర్తి స్పష్టత, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.