sensex: పెరిగిన చమురు ధరలు... కుప్పకూలిన మార్కెట్లు
- ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరిన ముడి చమురు ధరలు
- 495 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 158 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర ఆరు నెలల గరిష్ట స్థాయికి పెరగడం మార్కెట్లపై పెను ప్రభావాన్ని చూపింది. ఇరాన్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకునే దేశాలపై ఆంక్షలను సడలించబోమని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో ప్రకటించడంతో మార్కెట్లు కుదేలయ్యాయి. ఇరాన్ కు చైనా తర్వాత అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారు ఇండియానే. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 495 పాయింట్లు పతనమై 38,645కు పడిపోయింది. నిఫ్టీ 158 పాయింట్లు కోల్పోయి 11,594కు దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (6.62%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.11%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.76%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.54%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.44%).
టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (0.89%), టీసీఎస్ (0.88%), ఇన్ఫోసిస్ (0.59%), ఎన్టీపీసీ (0.26%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.08%). భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ తదితర చమురు కంపెనీలు కూడా నష్టాలను మూటకట్టుకున్నాయి.