intermediate: తప్పుడు మూల్యాంకనం చేసిన వారికి రెండు వేలు జరిమానా!: విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి
- త్రిసభ్య కమిటీ మూడు రోజుల్లో నివేదిక ఇవ్వనుంది
- తప్పు తేలితే రీ వెరిఫికేషన్ ఫీజు తిరిగి చెల్లించే ఆలోచన
- విద్యార్థులు ఆత్మహత్యలకి పాల్పడవద్దు
తెలంగాణలో ఈసారి ఇంటర్ ఫలితాలు గందరగోళంగా మారాయి. ఫలితాల విషయంలో చోటుచేసుకున్న పొరపాట్లు కొంతమంది విద్యార్థుల ఆత్మహత్యలకి కారణమయ్యాయి. మరికొందరు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి విద్యార్థి సంఘాలు ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట నిరసనలకు దిగాయి.
ఈ విషయంపై విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి స్పందిస్తూ .. "ఇంటర్ ఫలితాలకు సంబంధించిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపి, మూడు రోజుల్లో నివేదిక ఇవ్వనుందని అన్నారు. సిబ్బంది తప్పు చేసినట్టుగా తేలితే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని అన్నారు. తప్పుడు మూల్యాంకనం చేసిన సిబ్బందికి రెండు వేలు జరిమానా విధించనున్నామనీ, ఈ జరిమానాను మరింత పెంచే ఆలోచన కూడా ఉందని స్పష్టం చేశారు. రీ వెరిఫికేషన్ లో సిబ్బంది వైపు నుంచి తప్పు జరిగిందని తేలితే, సదరు విద్యార్థులకు ఫీజు తిరిగి చెల్లించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలకి పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.