Hyderabad: భారీ వర్షానికి దెబ్బతిన్న ఉప్పల్ స్టేడియం.. కుప్పకూలిన షెడ్డు.. తప్పిన ప్రమాదం
- నగరంలో గాలివాన బీభత్సం
- ఉప్పల్ స్టేడియంలో 80 శాతం ధ్వంసమైన సౌత్ పెవిలియన్
- చాంద్రాయణగుట్టలో షెడ్డు కూలి బాలుడి మృతి
సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం పెను నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులకు ఎన్టీఆర్ స్టేడియంలోని ఎగ్జిబిషన్ షెడ్, ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలాయి. ఫ్లడ్ లైట్ కూలిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానానికి నష్టం వాటిల్లింది. సౌత్ పెవిలియన్ బైలాక్‌లోని షెడ్డు, భారీ ఎల్‌ఈడీ లైట్ కుప్పకూలాయి.
పెవిలియన్‌లో 80 శాతం దెబ్బతిన్నట్టు స్టేడియం నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. కాగా, నగరంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. చాంద్రాయణగుట్టలో ఓ షెడ్డు కూలి బాలుడు మృతి చెందాడు. పలుచోట్ల భారీ వృక్షాలు కుప్పకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో ఉప్పల్ పరిసర ప్రాంతాలు అంధకారంగా మారాయి.