Uttar Pradesh: ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేసిన అఖిలేష్ యాదవ్...ఎవరికి వేసినా కమలానికే పడుతోందని ఆరోపణ
- దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
- పోలింగ్ సిబ్బందికి అవగాహన లేదనడం బాధ్యతరాహిత్యం
- రామ్‌పూర్‌లో ఉద్దేశపూర్వకంగా 350 మిషన్లు మార్చారు
సార్వత్రిక ఎన్నికల్లో వినియోగిస్తున్న ఈవీఎంల పనితీరుపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎవరికి ఓటు వేస్తున్నా కమలానికే పడుతోందని ఆరోపించారు. తొలివిడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇటువంటి అనుమానాలే వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎవరికి వేసినా ఫ్యాన్‌కే పడుతోందని అన్న ఆయన ‘నా ఓటు నాకే పడిందా’ అని సందేహం వ్యక్తం చేయడం అప్పట్లో చర్చకు దారితీసింది.
తాజాగా అఖిలేష్ యాదవ్ కూడా అటువంటి అనుమానమే వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదని, అడిగితే పోలింగ్ సిబ్బందికి అవగాహనలేక చిన్నచిన్న సమస్యలు తలెత్తుతున్నాయని ఎన్నికల అధికారులు చెప్పడం బాధ్యతారాహిత్యమన్నారు. రామ్‌పూర్‌లో ఉద్దేశపూర్వకంగానే 350 ఈవీఎంలు మార్చారని ధ్వజమెత్తారు.