Andhra Pradesh: పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు భారీ కుట్ర.. ఓటుకు రూ.3 వేలు పంచారు!: సీపీఐ నేత రామకృష్ణ సంచలన ఆరోపణ
- ఏపీలో నగదు వరదను పారించారు
- జగన్ కు కేసీఆర్ రూ.600 కోట్లు ఇచ్చారు
- విజయవాడలో మీడియాతో సీపీఐ నేత
ఆంధ్రప్రదేశ్ లోని చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు. నీటి సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో మెమొరాండం ఇస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నగదు వరదను పారించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను భీమవరంలో ఓడించడానికి రాజకీయ పార్టీలు భారీ కుట్రకు తెరలేపాయనీ, ఒక్కో ఓటుకు రూ.3,000 ఖర్చు పెట్టాయని ఆరోపించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు.
ప్రస్తుతం డబ్బున్నవారే ఏపీ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబు సమీక్షలు చేయకూడదని ఈసీ మాట్లాడుతోందనీ, ఎన్నికల్లో ధన ప్రవాహం ఈసీకి కనిపించలేదా? అని రామకృష్ణ ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైసీపీ అధినేత జగన్ కు రూ.600 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.
పోలీసుల తనిఖీల్లో డబ్బులు దొరికిన ప్రతీ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమయిందనీ, ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.