Vijay Sai Reddy: విజయసాయి రెడ్డి ఈసీని తప్పుదారి పట్టిస్తున్నారు: లంక దినకర్
- ఈసీ కోడ్ పై కనీస అవగాహనలేదు
- మోదీ కోడ్ గా మార్చేశారు
- క్షమాపణలు చెప్పాలి
టీడీపీ అధికార ప్రతినిధి లంక దినకర్ మరోసారి బీజేపీ, వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రెండు పార్టీల నేతలు ఎన్నికల నియమావళిని 'మోదీ నియమావళి'గా మార్చేశారని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీజేపీకి 'బీ' టీమ్ గా వ్యవహరిస్తున్న వైసీపీ ఎన్నికల నియమావళికి కొత్త భాష్యం చెబుతున్నాయని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిపై లంక మండిపడ్డారు.
విజయసాయిరెడ్డి ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వచ్చేదాకా ముఖ్యమంత్రి సమీక్షలు జరపవచ్చని నియమావళిలోనే ఉందని, దీనిపై విజయసాయి అసంబద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆయన ఓసారి నియమావళి చదివితే అందులో ఏముందో తెలుస్తుందని హితవు పలికారు. ప్రజాసంక్షేమం కోసం సీఎం సమీక్షలు జరుపుతుంటే వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని, వారు క్షమాపణలు చెప్పాలని లంక దినకర్ డిమాండ్ చేశారు.
ఎన్నికల నియమావళిలో ఆంక్షలు విధిస్తూనే, కొన్నిచోట్ల వాటికి వెసులుబాట్లు కల్పించారని, అవేవీ తెలుసుకోకుండా వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారికి కనీస అవగాహన లేదన్న విషయం అర్థమవుతోందని, ఇందులో విజయసాయిరెడ్డికి కూడా మినహాయింపు లేదని విమర్శించారు.