Central Force: బీజేపీకి ఓటేయమని కేంద్ర బలగాలు ఓటర్లను కోరడమేంటి?: మమతా బెనర్జీ ఫైర్
- పోలింగ్ బూత్‌ల వద్ద ప్రచారం
- ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తా
- పోలింగ్ బూత్‌లలో వారికి పనేంటి?
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న మాల్దహ దక్షిణ్, బలూర్ ఘాట్ నియోజకవర్గాల్లో కేంద్ర బలాగాలు బీజేపీకి ఓటేయమంటూ ప్రచారం నిర్వహిస్తున్నాయని మమత తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆమె వివరించారు.
కేంద్ర బలగాలు బీజేపీకి ఓటేయమని ఓటర్లను కోరుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, అలా చేయడానికి వారికి ఎలాంటి హక్కూ లేదన్నారు. అసలు కేంద్ర బలగాలకు పోలింగ్ బూత్‌లలో పనేంటని, వాటిలోకి వెళ్లకూడదని తెలియదా? అంటూ నిలదీశారు. ఎన్నికల సమయంలో రాష్ట్రాలకు వచ్చి, రాష్ట్ర బలగాలకు సహకరించడమే కేంద్ర బలగాల పని అని మమత తెలిపారు. 2016లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేంద్ర బలాగాలను బీజేపీ వాడుకుందని, దానిని తాను మరచిపోనని అన్నారు.