Sri Lanka: లాంగ్ జర్నీతో అలసిపోయి చర్చికి వెళ్లని శ్రీలంక క్రికెటర్... అదే అతని ప్రాణాలు కాపాడింది!
- తల్లి, బామ్మకు గాయాలు
- దిగ్భ్రాంతికి గురైన క్రికెటర్
- నెగొంబోలో తీవ్ర విధ్వంసం
శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ పండుగ సందర్భంగా జరిగిన మారణహోమంలో 320 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో క్షతగాత్రులయ్యారు. ఈ సందర్భంగా శ్రీలంక జాతీయ క్రికెటర్ దసున్ షనక అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకున్నాడు. వాస్తవానికి షనక ఆ రోజు ఈస్టర్ ప్రార్థనల కోసం చర్చికి వెళ్లాల్సి ఉంది. అతని స్వస్థలం అయిన నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో ఈస్టర్ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
అయితే, అంతకుముందు రోజు లాంగ్ జర్నీ చేయడంతో షనక బాగా అలసిపోయాడు. దాంతో చర్చికి వెళ్లకుండా ఇంటివద్దే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే, అతని తల్లి, బామ్మ ఈస్టర్ ప్రార్థనల కోసం చర్చికు వెళ్లారు. అంతలోనే చర్చి దిశగా పెద్ద శబ్దం వినిపించడంతో షనక వెంటనే బయల్దేరి వెళ్లాడు.
అప్పటికే అక్కడ భీతావహంగా కనిపిస్తోంది. అతని తల్లి, బామ్మలకు ప్రాణాపాయం లేకపోయినా ఇద్దరూ గాయపడ్డారు. బామ్మకు తలలో పదునైన వస్తువు గుచ్చుకోవడంతో వెంటనే సర్జరీ చేయాల్సి వచ్చింది. 27 ఏళ్ల షనక 3 టెస్టులు, 19 వన్డేలు, 27 టి20 మ్యాచ్ లు ఆడాడు.