Sri Lanka: ముందస్తు సమాచారం ఉన్నా దాడులు ఆపలేకపోయాం... క్షమించండి!: శ్రీలంక ప్రభుత్వం ప్రకటన
- దారుణంపై చింతిస్తున్నాం
- కొన్నిరోజుల ముందే హెచ్చరికలు అందాయి
- బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
ఈస్టర్ సందర్భంగా జరిగిన నరమేధంపై పది రోజుల ముందే సమాచారం ఉన్నా దాడులను అడ్డుకోలేకపోవడం పట్ల శ్రీలంక ప్రభుత్వం తీవ్రంగా చింతిస్తోంది. నిస్సందేహంగా ఇది తమ వైఫల్యమేనని అంగీకరించింది. ఈ మేరకు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ప్రతినిధి రజిత సేనరత్నే పేరిట ఆ ప్రకటన వెలువడింది.
"జరిగిన సంఘటనల పట్ల బాధపడుతున్నాం. నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నా తగిన రీతిలో స్పందించలేకపోయాం. బాధితుల కుటుంబాలకు, సంస్థలకు ప్రభుత్వం క్షమాపణలు తెలుపుకుంటోంది. బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంతోపాటు దెబ్బతిన్న చర్చిల పునర్నిర్మాణం బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వమే స్వీకరిస్తుంది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.