Hyderabad: హిమాయత్ నగర్ టీటీడీ కల్యాణమండపం సీజ్!
- వివాహాలకు ఇవ్వని లీజుదారుడు
- ఫిర్యాదులు రావడంతో టీటీడీ విజిలెన్స్ అధికారుల తనిఖీలు
- కల్యాణ మండపాన్ని సీజ్ చేసిన అధికారులు
లీజు గడువు ముగిసినా డబ్బు చెల్లించకుండా, వివాహాది శుభవేడుకలకు అద్దెకివ్వకుండా, వాణిజ్య కార్యకలాపాలకు మాత్రమే వాడుతున్నారన్న కారణంతో హైదరాబాద్, హిమాయత్ నగర్ లోని టీటీడీ కల్యాణ మండపాన్ని తిరుమల విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి, తమ అధీనంలోకి తీసుకున్నారు.
ప్రైవేటు వ్యాపారాలకు కల్యాణమండపాన్ని అద్దెకివ్వడం నిబంధనలకు విరుద్ధమని, లీజుదారుడు చెల్లించాల్సిన బకాయి కోటి రూపాయలు దాటి పోయిందని వెల్లడించిన అధికారులు, గత సంవత్సరం అక్టోబర్ తోనే లీజు గడువు ముగిసిందని తెలిపారు. అప్పట్లో లైసెన్స్ దారుడు కోర్టుకు వెళ్లి ఎక్స్ టెన్షన్ కోరుతూ స్టే ఆర్డర్ తెచ్చుకున్నారని, అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అధికారులు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఈ కల్యాణమండపం ఎస్ వైష్ణవి అనే మహిళ పేరుతో కొనసాగుతోంది. పెళ్లిళ్లకు మండపాన్ని ఇవ్వకుండా, ఎగ్జిబిషన్లు తదితరాలకు మాత్రమే ఇస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తడంతో విజిలెన్స్ అధికారులు దాడులు చేసి, మండపాన్ని సీజ్ చేశారు.