rohit sharma: రోహిత్ ను హత్య చేయడానికి కారణం ఇదే: ఎన్డీ తివారి కోడలు అపూర్వ
- దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రోహిత్ శేఖర్ హత్య
- మిస్టరీని రోజుల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
- పెళ్లి సంతోషాన్ని ఇవ్వలేదన్న భార్య
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రోహిత్ భార్య అపూర్వనే హత్య చేసిందని తేల్చారు. అపూర్వను అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. ఈ విచారణలో ఆమె నిజాలను ఒప్పుకున్నారు. తమ పెళ్లి సంతోషాన్ని ఇవ్వలేదని, తన కలలు, ఆశలు నెరవేరనందునే రోహిత్ ని చంపేశానని ఆమె తెలిపారు. ఈ నెల 16వ తేదీన రోహిత్ ముఖాన్ని దిండుతో ఒత్తి, ఊపిరి ఆడకుండా చేసి, చంపేసిన సంగతి తెలిసిందే.
హత్య జరిగిన తీరును సీనియర్ పోలీసు అధికారి రాజీవ్ రంజన్ వివరించారు. 'ఏప్రిల్ 16న రోహిత్ ఉన్న గదిలోకి అపూర్వ వెళ్లింది. హత్య చేసింది. ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేకుండా చేసింది. మొత్తం 90 నిమిషాల్లో అంతా ముగించేసింది' అని ఆయన వెల్లడించారు.
తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్తరాఖండ్ కు వెళ్లిన రోహిత్, అక్కడి నుంచి ఏప్రిల్ 15న ఢిల్లీకి తిరిగివచ్చాడు. పూటుగా మద్యం సేవించి పక్కనున్న గోడకు చేయి ఆనించి, ఆయన నడుస్తున్న సన్నివేశం ఢిఫెన్స్ కాలనీలోని ఆయన నివాసం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో లభించింది.
ఆ మరుసటి రోజు ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న అతని తల్లికి రోహిత్ ముక్కు నుంచి రక్తం వస్తున్నట్టు ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడకు వెళ్లిన ఆమె రోహిత్ ను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, రోహిత్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. రోహిత్ తల్లికి ఫోన్ వెళ్లిన సమయంలో ఇంట్లో భార్య అపూర్వ, ఆమె కజిన్ సిద్ధార్థ్, పనిమనిషి ఉన్నారని పోలీసులు తెలిపారు.