Andhra Pradesh: విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో మాపై చాలా అసభ్యమైన పదజాలం వాడుతున్నారు!: కుటుంబరావు ఆగ్రహం
- యనమల చాలా అనుభవమున్న వ్యక్తి
- ఆయన అనుభవంలో సాయిరెడ్డిది 1-2 శాతమే
- జైలుకు పోతామని వైసీపీ నేతలకు భయం పట్టుకుంది
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
వైసీపీ నేతల వ్యవహారశైలిపై ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్రంగా మండిపడ్డారు. 2013 నుంచి 2019 వరకూ వైసీపీ నేతలు కేసులను సాగదీస్తూ వచ్చారని విమర్శించారు. నిజంగా దమ్ముంటే ఈ కేసులన్నింటిని 6 నెలల్లో తేల్చేలా కోరాలని సవాల్ విసిరారు. జైలుకు పోతామన్న భయం వైసీపీ నేతలకు పట్టుకుందని దుయ్యబట్టారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కుటుంబరావు మాట్లాడారు.
విజయసాయిరెడ్డి తనను బ్రోకర్ అని చెప్పడంపై కుటుంబరావు ఘాటుగా స్పందించారు. చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలని విజయసాయిరెడ్డిని డిమాండ్ చేశారు. ‘నా జీవితమంతా తెరచిన పుస్తకం. ఏదైనా కేసు నాపై ఉంటే చెప్పండి. నీపైన ఇంతపెద్ద చిట్టా ఉంది. మొన్న జగన్ పైన 31 పేజీలు అఫిడవిట్ లో పెట్టారంటే, నేను అనుకుంటున్నా రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డిపైన అంతే పెద్ద చిట్టా ఉంటుంది. కానీ రాజ్యసభ సభ్యుడు కాబట్టి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు’ అని చురకలు అంటించారు.
స్టాక్ బ్రోకర్ అంటే అదేదో తప్పుడు పనులు చేసే వ్యక్తి కాదని కుటుంబరావు అన్నారు. ‘బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా స్టాక్ బ్రోకర్ గానే పనిచేశారు. ఆర్థిక వ్యవస్థకు స్టాక్ బ్రోకింగ్ అన్నది జీవనాడి లాంటిది. కాబట్టి స్టాక్ బ్రోకింగ్ ను తీసిపారేసేలా, దిగజార్చేలా మాట్లాడటం సబబు కాదు. నేను ఎప్పుడైనా ఆర్థిక శాఖ సమావేశాల్లో, నిర్ణయాల్లో పాలుపంచుకున్నానా? విజయసాయిరెడ్డి ఆరోపణలకు సాక్ష్యం చూపమనండి.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా 12 కమిటీల్లో ఉన్నాను. కాబట్టి కొన్ని ప్రత్యేక సమావేశాలకు మాత్రమే హాజరయ్యాను. అత్యంత సీనియర్ నేత యనమల గారిని అవమానించేలా విజయసాయిరెడ్డి మాట్లాడటం చాలా తప్పు. యనమల అనుభవంలో విజయసాయిరెడ్డి అనుభవం 1-2 శాతం మాత్రమే ఉంటుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో తమపై చాలా అసభ్యమైన పదజాలం వాడుతున్నారనీ, ఇది నిజంగా బాధపడాల్సిన విషయమని కుటుంబరావు వ్యాఖ్యానించారు.