Rajasthan: నిద్రపోతున్న పులిపై రాళ్లువేసిన టూరిస్టు.. దిమ్మతిరిగే జరిమానా విధించిన టైగర్ రిజర్వ్ అధికారి!
- రాజస్థాన్ లోని జైపూర్ లో ఘటన
- రణతంబోర్ జాతీయ పార్కుకు వెళ్లిన టూరిస్టు
- పులి ఫొటో తీసేందుకు ప్రయత్నం
టైగర్ రిజర్వు పార్కుకు వెళ్లిన ఓ టూరిస్టు పులిని చూడాలనుకున్నాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ క్రూర జంతువు ఫొటో తీసేందుకు దానిపై రాళ్లు విసిరాడు. అయితే ఇది గమనించిన పులుల సంరక్షణాధికారి కొరడా ఝుళిపించాడు. సదరు పర్యాటకుడితో పాటు అతని గైడ్ గా వ్యవహరించిన వ్యక్తిపై భారీ జరిమానా విధించాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో చోటుచేసుకుంది.
జైపూర్ సమీపంలో ఉన్న రణతంబోర్ జాతీయ టైగర్ రిజర్వులో ఓ గైడర్ తో పాటు పర్యాటకుడు వచ్చారు. పార్క్‌లోని జోన్-6లో ఉన్న పిలిఘాట్ గేట్ నుంచి వీరు ఒక జిప్సీలో పార్క్‌లోకి ప్రవేశించారు. పార్క్ గురించి గైడర్ చెప్పే విషయాలు వింటూ అక్కడి ప్రదేశాలను, జంతువులను సదరు పర్యాటకుడు కెమెరాలో బంధిస్తున్నాడు. అంతలోనే అతనికి నిద్రపోతున్న ఓ పులి కనిపించింది.
అయితే దాన్ని ఎలాగైనా ఫొటో తీయాలని భావించిన ఆ టూరిస్ట్ పక్కనే ఉన్న కొన్ని రాళ్లు తీసుకుని దానిపై విసిరాడు. ఆ అలికిడికి ఒక్కసారిగా లేచిన పులి గట్టిగా గాండ్రించింది. దీంతో ఈ తతంగాన్ని స్థానిక పులుల సంరక్షణాధికారి గమనించాడు. పర్యాటకుడితో పాటు గైడర్ కు రూ.51,000 జరిమానా విధించాడు. దీంతో సరదా కోసం రాళ్లు విసిరిన సదరు టూరిస్టు భారీగా చేతిచమురును వదిలించుకున్నాడు.