Telangana: ఇంటర్ లో ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్: సీఎం కేసీఆర్ ఆదేశాలు
- విద్యా శాఖ మంత్రి, అధికారులతో ముగిసిన సమీక్ష
- రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ త్వరగా పూర్తి చేయాలి
- విద్యా సంవత్సరం నష్టపోకుండా అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ నిర్వహించాలి
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం కారణంగా నిరసనలు తీవ్రతరం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తో సీఎం కేసీఆర్ ఈ రోజు సమీక్షించారు. ఇంటర్ లో ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. ఉత్తీర్ణులైన విద్యార్థులు, రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కోరితే గత విధానమే పాటించాలని సూచించారు.
రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ త్వరగా పూర్తి చేయాలని, విద్యార్థులు తమ విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ నిర్వహించాలని ఆదేశించారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ బాధ్యతను జనార్దన్ రెడ్డికి అప్పగించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాన్ని ఖరారు చేయాలని సూచించారు. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకర సంఘటనలని అన్నారు. పరీక్ష తప్పితే జీవితం ఆగిపోదని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు.
కాగా, ఇంటర్ జవాబు పత్రాల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం హైదరాబాద్ లో 8 కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. గన్ ఫౌండ్రి మహబూబియా జూనియర్ కళాశాల, నాంపల్లి ఎంఏఎం జూనియర్ కళాశాల, కాచిగూడలోని ప్రభుత్వ కళాశాల, ఫలక్ నుమా ప్రభుత్వ బాలుర కళాశాల, హయత్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, శంషాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, మేడ్చల్ జిల్లా డీఐఈవో కార్యాలయం, కూకట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. రీ వాల్యుయేషన్ రుసుం రూ.600, రీ కౌంటింగ్ రుసుం రూ.100గా నిర్ణయించారు. విద్యార్థులు ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అనుమతించారు.