Sri Lanka: శ్రీలంక పేలుళ్ల ఘటనలో వెలుగులోకి విస్తుపోయే నిజాలు
- పేలుళ్లకు పాల్పడిన దుండగుల్లో ప్రముఖ వ్యాపారి కుమారులు
- వ్యాపారి, వారి మూడో కుమారుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
- సిన్నమన్ గ్రాండ్, షాంగ్రీలా హోటళ్లలో దాడులు జరిపింది వారే
ఈస్టర్ సండే రోజున శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులకు సంబంధించి వెలుగుచూస్తున్న విషయాలు విస్తుగొలుపుతున్నాయి. హోటళ్లు, చర్చిలలో పేలుళ్లకు పాల్పడిన దుండగుల్లో శ్రీలంకలోని ప్రముఖ వ్యాపారి అయిన మహ్మద్ యూసుఫ్ ఇబ్రహీం కుమారులు ఇమ్సాత్ అహ్మద్ ఇబ్రహీం (33), ఇల్హాం అహ్మద్ ఇబ్రహీం (31) ఉన్న విషయం తాజాగా బయటపడి సంచలనమైంది. మసాల దినుసుల వ్యాపారంలో యూసుఫ్ ఇబ్రహీం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
అన్నదమ్ములైన ఇమ్సాత్, ఇల్హాం ఇద్దరూ బ్యాగుల్లో బాంబులు నింపుకుని కొలంబోలోని సిన్నమన్ గ్రాండ్, షాంగ్రీ లా హోటళ్లలో దాడులకు పాల్పడినట్టు సమాచారం. వీరి పేర్లు బయటకు రాగానే యూసుఫ్ సహా ఆయన మూడో కుమారుడైన ఇజాస్ అహ్మద్ ఇబ్రహీం (30)ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాంబు పేలుళ్లు తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే యూసుఫ్ కుమారులకు సంబంధం ఉందనే విషయం బయటపడి సంచలనమైంది.