Summer: ఎండల నుంచి కాస్తంత ఉపశమనం... ఏపీ, టీఎస్ లకు వర్ష సూచన!
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- తుపానుగా మారే అవకాశం
- తమిళనాడుకు కూడా వర్షాలు
ఎండ మంటలతో అల్లాడుతున్న తెలుగు ప్రజలకు ఇది చల్లని కబురు. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా, ఇది రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా మారనున్నదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఆపై ఇది వాయవ్యంగా ప్రయాణించి, తుపాన్ గా మారి, దక్షిణ తమిళనాడు పరిసరాల్లో తీరం దాటుతుందని, దీని ప్రభావంతో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలో చెదురుమదురు జల్లులు కురిసే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని, 48 గంటల తరువాత వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేశారు.