Bank: బెదిరింపు కాల్స్ చేస్తున్న 'వెలుగు' ఉద్యోగిని శివరంజని అరెస్ట్.. రిమాండ్!
- బ్యాంకులో బాంబులు పెట్టినట్టు పలువురికి మెసేజ్
- తప్పుడు కాల్స్, మెసేజ్ లుగా నిర్ధారించిన పోలీసులు
- శివరంజనికి 14 రోజుల రిమాండ్
అనకాపల్లిలోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో బాంబు ఉందని తప్పుడు కాల్ చేసిన వెలుగు ఉద్యోగిని శివరంజని ఇప్పుడు జైల్లో ఉంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బ్యాంకు మేనేజర్ గాలి కిరణ్ కుమార్ కు ఫోన్ చేసిన ఓ మహిళ, బాంబు గురించి సమాచారం ఇవ్వగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాంక్ ఆవరణలోనూ, పరిసరాల్లోనూ సోదాలు నిర్వహించగా ఎటువంటి బాంబు జాడా లభించలేదు.
ఆపై దీన్ని ఫేక్ కాల్ గా నిర్ధారించి, నంబర్ ను ట్రేస్ చేయగా, మండల పరిధిలోని సీతానగరంలో ఉండే రాచేపల్లి వీర శివరంజనిదని గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి విచారించగా, మంగళవారం నాడు గుంటూరు రూరల్ ఎస్పీ విజయరాజు, మరో 16 మంది అధికారులకు ఆమె, ఈవీఎంలను పేల్చేందుకు బాంబులు పెట్టారని, బ్యాంకులను పేల్చనున్నారని మెసేజ్ లు పంపినట్టు తేలింది. ఈ నెల 13న తన స్నేహితురాలి ఇంట్లో సిమ్ కార్డును దొంగిలించిన ఆమె, ఆ నెంబర్ తో ఈ పని చేసిందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు, ఆమెను కోర్టు ముందు హాజరు పరచగా, రెండు వారాల రిమాండ్ ను కోర్టు విధించింది.