Chandrababu: తెలంగాణ విషయంలో మాట్లాడరుగానీ, మా విషయంలో యాగీనా?: ఈసీపై చంద్రబాబు నిప్పులు
- కేసీఆర్ సమీక్షలు నిర్వహిస్తుంటే మాట్లాడరేం
- ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించ లేదు
- ఈసీ వ్యవహారంతో పాలన అస్తవ్యస్తమైంది
- అధికారులు, ప్రభుత్వం మధ్య చీలిక తెస్తున్న ఈసీ
- మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తన ఇష్టానుసారం సమీక్షలు నిర్వహిస్తుంటే నోరు మెదపని ఎన్నికల సంఘం, తాను ఏదైనా రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మాత్రం నానాయాగీ చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించే పరిస్థితి లేదని విమర్శించారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు మాత్రమే ఈసీ పరిధిలో ఉంటారని, మిగతా వాళ్లంతా ప్రభుత్వం కిందే పని చేయాల్సి వుంటుందని గుర్తు చేసిన చంద్రబాబు, ఈసీ వ్యవహారంతో పాలన అస్తవ్యస్తం అవుతోందని మండిపడ్డారు.
గడచిన ఐదేళ్లుగా ప్రభుత్వ అధికారులు ఎంతో సహకరించడంతోనే ఎన్నో రంగాల్లో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచిందని అన్నారు. ఇప్పుడు ఈసీ వచ్చి ప్రభుత్వం, అధికారుల మధ్య చీలిక తెచ్చేలా వ్యవహరిస్తోందని అన్నారు. వ్యక్తిగత అజెండాతో ఈసీ పని చేస్తోందని, కులం, మతం అంటూ విభేదాలు పెడుతున్నారని ఆరోపించారు. ఈసీ కుట్రలను సంయుక్తంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, టీడీపీ శ్రేణులంతా మరింతగా శ్రమించేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.