R Krishnaiah: చనిపోయిన ప్రతి విద్యార్థికీ రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే: ఆర్.కృష్ణయ్య
- బోర్డు వైఖరి, తప్పిదాల కారణంగానే మరణాలు
- కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
- విద్యార్థుల కుటుంబాల బాధను తీర్చాల్సిందే
- బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య
తెలంగాణ ఇంటర్ మీడియేట్ బోర్డు వైఖరి, చేసిన తప్పిదాల కారణంగా మరణించిన ప్రతి విద్యార్థికీ రూ. 2 కోట్ల నష్టపరిహారం ఇచ్చి తీరాలని బీసీ సంఘాల నేత రాగ్యా కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ ను ఉచితంగా చేస్తామన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాల బాధను ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు.
కేసీఆర్ నిర్ణయం విద్యార్థులకు మేలు చేసేదేనని వ్యాఖ్యానించిన ఆయన, ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కార్పొరేట్ కాలేజీల జోక్యం తగ్గాలని అన్నారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుని, వారిని వెంటనే తొలగిస్తేనే, మరోసారి ఇటువంటి తప్పు జరుగకుండా ఉంటుందని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. కాగా, నేడు కూడా ఇంటర్ బోర్డు ముందు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నిరసనలు కొనసాగాయి. బోర్డు కార్యాలయం ఎదుట మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు, కేవలం ఉద్యోగులను మాత్రమే కార్యాలయంలోనికి అనుమతిచ్చారు.