supreme court: నిప్పుతో చెలగాటమాడుతున్నారు.. బీ కేర్ ఫుల్!: ధనవంతులు, శక్తిమంతులకు సుప్రీంకోర్ట్ వార్నింగ్
- సుప్రీంకోర్టును రిమోట్ కంట్రోల్ చేయలేరు
- ధనబలం, రాజకీయబలంతో కోర్టును ఏమీ చేయలేరు
- సుప్రీంకోర్టుపై పథకం ప్రకారం దాడి జరుగుతోంది
భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ పై లైంగిక వేధింపులకు సంబంధించి లాయర్ ఉత్సవ్ బయిన్స్ వేసిన పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. తీర్పులను ఫిక్స్ చేయడమనేది చాలా సీరియస్ అని దీనిపై విచారణ జరగాలని తెలిపింది. విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నారీమన్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ధనవంతులు, శక్తిమంతులైన వ్యక్తులకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన రోజు వచ్చిందని... న్యాయ వ్యవస్థను మీరు నియంత్రించలేరని తెలిపింది. ధనికులు, శక్తిమంతులు నిప్పుతో చెలగాటమాడుతున్నారని... దీనికి వెంటనే ముగింపు పలకాలని హెచ్చరించింది.
'ఫిక్సింగ్ చాలా సీరియస్ అంశం. ప్రపంచంలో ఉన్న దేని ద్వారా కూడా సుప్రీంకోర్టును రిమోట్ కంట్రోల్ చేయలేరు. ధనబలం, రాజకీయబలంతో కోర్టును ఏమీ చేయలేరు. గత కొన్నేళ్లుగా ఈ వ్యవస్థను ఇలాగే చూశారు. అదే జరిగితే వ్యవస్థ మనుగడ సాధించలేదు. కోర్టుపై ఒక పథకం ప్రకారం దాడి జరుగుతోంది. ఒక పథకం ప్రకారం దూషిస్తున్నారు' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అజయ్ అనే వ్యక్తి తనను కలిశాడని... చీఫ్ జస్టిస్ గొగోయ్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పని చేసిన ఓ మాజీ ఉద్యోగిని చేత ప్రెస్ మీట్ పెట్టించాలని కోరాడని ఉత్సవ్ బయిన్స్ పిటిషన్ వేశారు. ఈ పని చేసేందుకు తనకు రూ. 1.5 కోట్లు ఆఫర్ చేశాడని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తుకు నేడు సుప్రీం ఆదేశించే అవకాశం ఉంది.