Telangana: ఇంటర్ డేటాను ఎంటర్ చేసే సామర్థ్యం ఈ సంస్థకు ఉందా?: కోదండరామ్
- భవిష్యత్ లో మరిన్ని ఆందోళనా కార్యక్రమాలు
- గ్లోబరినా సంస్థ గతంలో లేదు
- అందరం కలసి వెళ్లి గవర్నర్ ను కలుస్తాం
తెలంగాణ ఇంటర్ బోర్డు తీరుపై అఖిలపక్ష నేతలందరం గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. హైదరాబాద్ లోని టీజేఎస్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ లో మరిన్ని ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
సాఫ్ట్ వేర్ లో వచ్చే లోపాలను సవరించడం కీలకమని, లేదంటే ఇలాంటి గందరగోళం ఏర్పడటం ఖాయమని అన్నారు. గ్లోబరినా సంస్థ గతంలో లేదని, ఇంటర్ డేటాను ఎంటర్ చేసే సామర్థ్యం ఈ సంస్థకు ఉందా అన్నది అనుమానమేనని అన్నారు. ఈ సంస్థ ఈ ఏడాది ఆరంభం నుంచి అన్నీ తప్పిదాలే చేస్తూ వస్తోందని, ఇంటర్ బోర్డు నుంచి మార్కుల డేటా స్వీకరించి అప్ డేట్ చేయలేదని, ఈ అంశంపై కళాశాలల నుంచి ఎన్నో ఫిర్యాదులు అందాయని అన్నారు. అయినా, ఈ గందరగోళంపై ఇంటర్ బోర్డు అధికారులు సరిగా స్పందించలేదని విమర్శించారు.