Mayavati: అప్పుడు నెహ్రూ తర్వాత ఎవరని ప్రశ్నించారు... ఇప్పుడూ అలాగే అడుగుతున్నారు: బీజేపీపై మాయావతి ఫైర్
- అప్పట్లో ప్రజలే బుద్ధి చెప్పారు
- ఇప్పుడు కూడా వాళ్లే నోరు మూయిస్తారు
- మోదీకి ఈసీ నియమాలు వర్తించవా?
బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బీజేపీ నాయకుల వైఖరి ప్రజలను కించపరిచేలా ఉందంటూ విమర్శించారు. దేశంలో తాము తప్ప మరెవరూ నేతలుగా పనికిరారని బీజేపీ వాళ్లు భావిస్తున్నారని, ఇది అహంభావ ధోరణి అని ఆరోపించారు. అప్పట్లో నెహ్రూ తర్వాత ఎవరైనా ఉన్నారా? అంటూ ఎద్దేవా చేశారని, ఇప్పుడూ అదేరీతిలో ప్రతిపక్షాల్లో ప్రధానమంత్రి పదవికి సరైన అభ్యర్థే లేడంటూ వ్యంగ్యం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆనాడు ప్రజలే దీటుగా బదులిచ్చారని, ఇప్పుడు కూడా అలాంటి ప్రశ్నలు అడుగుతున్న వాళ్లను ప్రజలే నోరు మూయిస్తారని మాయావతి వ్యాఖ్యానించారు. 'బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు దేశానికి అందించింది నియమావళి కూడా పాటించని ఒక గొప్పనేతను' అంటూ మోదీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కోడ్ ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారంటూ ఆయనపై ఆరోపణలు వస్తున్నా ఈసీ తీసుకుంటున్న చర్యలు శూన్యం అని మాయావతి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.