Telangana: టీఆర్ఎస్ పాలనకు ఈ సంఘటనే నిదర్శనం: ఉత్తమ్ విమర్శలు
- పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు, ప్రభుత్వం విఫలం
- లక్షల మంది విద్యార్థులకు మానసిక క్షోభ
- విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం
తెలంగాణ ఇంటర్ ఫలితాలు గందరగోళంగా ఉండటంపై ప్రతిపక్ష నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు సూర్యాపేట కలెక్టర్ కు ఉత్తమ్ ఓ వినతిపత్రం సమర్పించారు.
అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇంటర్ ఫలితాలు తప్పుల తడకగా ఉండటమే టీఆర్ఎస్ పాలనకు నిదర్శనమని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు, ప్రభుత్వం విఫలమయ్యాయని, పది లక్షల మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురయ్యారని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని అన్నారు.