Governer: ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యంపై ఫిర్యాదు.. గవర్నర్ తో అఖిలపక్షం భేటీ
- గ్లోబరినా, బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలి
- ఈ ఘటనపై సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలి
- విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి: అఖిలపక్షం
రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను అఖిలపక్షం ఈరోజు కలిసింది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యం, ఫిరాయింపులపై ఆయనకు ఫిర్యాదు చేసింది. గవర్నర్ ను కలిసిన వారిలో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, టీడీపీ నేతలు ఎల్. రమణ, రావుల చంద్ర శేఖర్ రెడ్డి, తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్ తదితరులు ఉన్నారు.
గ్లోబరినా, ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని, విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని, ఈ ఘటనపై సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలని అఖిలపక్షం కోరింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు, రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని గవర్నర్ కు మనవి చేసినట్టు సమాచారం.