Guntur District: సీఎస్ కు బ్రాంచ్ ఆఫీసులా సీఈసీ తయారైంది: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
- కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతపై సీఎస్ మీటింగ్స్ ఎలా నిర్వహిస్తారు?
- సీఈసీ తన బాధ్యతలను నిర్వర్తించట్లేదు
- సీఎస్ తో సీఈసీ సమీక్షలు చేయిస్తారా?
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పరిపాలనా పరమైన సమీక్షలు నిర్వహించడం వల్ల తమకు ఎటువంటి ఇబ్బంది లేదని పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతకు సంబంధించిన మీటింగ్స్ ఆయన ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.
ఆ మీటింగ్స్ నిర్వహించాల్సింది ఎన్నికల సంఘం ప్రధానాధికారి అని గుర్తుచేశారు. ఎన్నికల సందర్భంగా సీఎస్ నుంచి అటెండర్ వరకూ సీఈసీ కంట్రోల్ లో ఉంటారని చెప్పిన నరేంద్ర, ఇటీవల జరిగిన ఓ సమావేశం గురించి ప్రస్తావించారు. సీఈసీ అధికారాలను కూడా సీఎస్ తన చెప్పుచేతల్లోకి తీసుకుని ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సీఈసీ తన బాధ్యతలను నిర్వర్తించకుండా సీఎస్ కు బ్రాంచ్ ఆఫీసులా తయారైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల కమిషన్ చెబితే కలెక్టర్లు, ఆఫీసర్లు వినడం లేదని, అందుకని తాను మీటింగ్స్ నిర్వహిస్తున్నానని సీఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిజంగా ఏ కలెక్టరయినా, ఏ ఆఫీసరైనా సహకరించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి లేఖ రాసి చర్యలు తీసుకోవచ్చని, మరి, ఆ అధికారం ఆయన చేతిలో ఉన్నప్పుడు, సీఎస్ తో సమీక్షలు చేయించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడమేనని అన్నారు.