Sri Lanka: తూచ్... చనిపోయింది 253 మందే: శ్రీలంక అధికారిక ప్రకటన
- తొలుత 359 మరణించారని ప్రకటన
- సరైన వివరాలు తెలుసుకున్న తరువాత సవరణ
- వెల్లడించిన లంక ఆరోగ్య శాఖ
గత ఆదివారం నాటి ఉగ్రదాడుల్లో మరణించింది 253 మందేనని శ్రీలంక వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండు రోజుల క్రితం మొత్తం 359 మంది మరణించారని ప్రకటించిన లంక ప్రభుత్వం, ఇప్పుడా సంఖ్యను 100కు పైగా తగ్గించడం గమనార్హం. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం, సరైన లెక్కలు, మృతుల వివరాలు తెలుసుకున్న తరువాత మరణించిన వారి సంఖ్యను సవరిస్తున్నట్టు తెలిపింది.
ఎంతో మంది మృతుల శరీరాలు గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైనాయని, ఆ కారణంతోనే కొన్ని మృతదేహాలను రెండేసి సార్లు లెక్కగట్టడం వల్ల సంఖ్యలో తేడా వచ్చిందని పేర్కొంది. కాగా, లంకలోని చర్చ్ లు, హోటళ్లలో జరిగిన వరుస పేలుళ్ల కారణంగా వందలాది మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఉగ్రదాడులపై ఇంటర్ పోల్, స్కాట్లాండ్ యార్డ్, ఎఫ్బీఐ సహా ఆరు విదేశీ పోలీస్ ఏజన్సీలు లంక పోలీసుల విచారణకు సహకరిస్తున్నాయి.