Narendra Modi: ప్రజాభిమానానికి వారణాసి రోడ్‌షోలో జనహోరే సాక్షి : ప్రధాని మోదీ
- నామినేషన్ ముందు కార్యకర్తలతో సమావేశం
- ఆ సందర్భంగా రోడ్‌షో గురించి ప్రస్తావన
- ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుందని ఉద్ఘాటన
నామినేషన్‌కు ముందు తాను వారణాసిలో నిర్వహించిన రోడ్‌షోలో పెల్లుబికిన ప్రజాదరణ భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో ఉన్న అభిమానానికి సాక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. వారణాసిలో నా విజయం కోసం పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని, అందుకు తగ్గ ప్రతిఫలం ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు నామినేషన్‌కు ముందు మోదీ స్థానిక కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు.
ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని, కానీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేది ప్రజలే అన్నారు. మోదీ గెలిచినా, గెలవక పోయినా ప్రజాస్వామ్యం కచ్చితంగా గెలుస్తుందన్నారు. కాశీలోని ప్రతి పౌరుడు నన్ను ఆశీర్వదిస్తారన్న పూర్తి నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తంచేశారు. ఈసారి ఓటింగ్ శాతం పెరగాలని, మహిళా ఓటింగ్ శాతం మరింత అధికంగా ఉండాలన్నారు.
కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలు భయంతో పని చేయాల్సి వస్తోందని, అక్కడి ప్రభుత్వాలు సురక్షితంగా ఉండనివ్వడం లేదన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరే వరకు కుటుంబ సభ్యులు ఆందోళనతో గడపాల్సిన దుస్థితి ఆ రాష్ట్రాల్లో ఉండడం సిగ్గుచేటన్నారు.