Phani: ఈ నెల 29 నుంచి దక్షిణ కోస్తాలో వర్షాలు... క్రమేపీ బలపడుతున్న వాయుగుండం
- మచిలీపట్నానికి 1760 కిమీ దూరంలో వాయుగుండం
- మరో 36 గంటల్లో తుపానుగా మారే అవకాశం
- ఈ నెల 30న పుదుచ్చేరి వద్ద తీరం దాటుతుందని అంచనా!
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం క్రమంగా బలపడుతోంది. మచిలీపట్నానికి ఆగ్నేయదిశగా 1760 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వాయుగుండం మరో 36 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో, కేరళలోని పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. వాయుగుండం బలపడి తుపానుగా మారిన తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఈ నెల 30న పుదుచ్చేరి వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.
కాగా, ఈ వాయుగుండం తుపానుగా మారితే బంగ్లాదేశ్ సూచించిన 'ఫణి' అనే పేరుతో పిలుస్తారు. ఫణి అంటే సర్పం అని తెలిసిందే. ఇది పేరుకు తగ్గట్టే వంపులు తిరుగుతూ పయనించే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దక్షిణ తమిళనాడులో తీరం దాటిన తర్వాత బలహీనపడిపోకుండా తీరాన్ని అంటిపెట్టుకుని ఏకంగా ఏపీ మీదుగా ఒడిశా వరకు పయనించే అవకాశాలు ఉన్నాయని పాశ్చాత్య వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
పశ్చిమ వాయవ్య దిశలో తీరం దాటిన అనంతరం, ఉత్తర దిశగా పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. తుపానులకు సంబంధించి ఇదొక అసాధారణ స్థితి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. లేదా, తమిళనాడు తీరాన్ని తాకకుండా నేరుగా ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా విశాఖపట్నం, ఒడిశా తీరాన్ని తాకుతూ ఈశాన్య దిశగా పయనించవచ్చన్నది మరో అంచనా!