BCCI: ఐపీఎల్‌కు మహిళా క్రికెటర్లను పంపని ఆస్ట్రేలియా.. బ్లాక్ మెయిలింగ్ అంటూ మండిపడిన బీసీసీఐ
- వచ్చే నెల 6 నుంచి 11 వరకు మహిళా ఐపీఎల్
- ఎఫ్టీపీ వివాదం తేలే వరకు మహిళా క్రికెటర్లను పంపేది లేదన్న సీఏ
- సీఏ నిర్ణయంపై బీసీసీఐ ఆగ్రహం
ఆసీస్ క్రికెట్ బోర్డు.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతోందంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఆసీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే, ఇందుకు సంబంధించి రెండు దేశాల బోర్డుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో భారత్‌లో జరగాల్సిన మహిళల ఐపీఎల్‌కు తమ జట్టును పంపకుండా సీఏ అడ్డుకుంది. దీనిని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ.. ఆసీస్ బోర్డు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతోందని ఆరోపించింది.
వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో ఆస్ట్రేలియా జట్టు పర్యటించాల్సి ఉంది. ఇందులో భాగంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగాల్సి ఉంది. అయితే, దీనిని వాయిదా వేయాలని భావిస్తున్న ఆసీస్ బోర్డు... వచ్చే నెలలో జరగనున్న మహిళల ఐపీఎల్‌కు తమ జట్టును పంపకుండా ఆపడం ద్వారా బీసీసీఐపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిణి బెలిందా క్లార్క్ బీసీసీఐకి ఈమెయిల్ పంపారు. 2020లో భారత్‌తో ఆడాల్సిన సిరీస్‌పై ఉన్న వివాదం పరిష్కారమైతే తప్ప మహిళా ఐపీఎల్‌కు తమ జట్టును పంపడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
సీఏ ఈమెయిల్‌పై స్పందించిన బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి దీనికి ముడిపెట్టడం ఏమిటని ప్రశ్నించింది. బెలిందా ఈమెయిల్ చూస్తుంటే తమను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా అనిపిస్తోందన్నారు. భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్టీపీ) ప్రకారం ఆసీస్‌తో సిరీస్ జరగాల్సి ఉందని, ఇప్పుడు వెనకడుగు వేయడం ఏమిటని నిలదీసింది.
మహిళా ఐపీఎల్లో ఆడాల్సిన ఆసీస్ వచ్చే నెల 6 నుంచి 11 వరకు జరగనున్న మహిళల ఐపీఎల్లో ఆసీస్ విమెన్ క్రికెటర్లు లానింగ్, ఎలిస్ పెర్రీ, అలిసీ హీలీలు ఆడాల్సి ఉండగా, వారిని భారత్ పంపాల్సిందిగా బీసీసీఐ కోరడంతో సీఏ ఇలా బదులిచ్చింది.