Telangana: గట్టిగా నిలబడ్డ పార్టీ మాత్రం టీఆర్ఎస్ పార్టీనే!: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభలో కేటీఆర్
- నాడు కేసీఆర్ ఒంటరిగా ఉద్యమం మొదలు పెట్టారు
- పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం
- ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పార్టీ ఉండాలి
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గులాబీ సైనికులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఒంటరిగా ఉద్యమం మొదలు పెట్టారని, పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కేసీఆర్ తోనే సాధ్యమైందని నాడు ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పార్టీ ఉండాలని అన్నారు. త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని నాడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మాటపై నిలబడి ఆనాడు తన పదవులకు రాజీనామా చేసిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి కానీ, గట్టిగా నిలబడ్డ పార్టీ మాత్రం టీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. 2001లో వేల సంఖ్యలో ఉన్న పార్టీ కార్యకర్తలు నేడు లక్షల సంఖ్యకు చేరారని అన్నారు.