Tirumala: టీటీడీ ఖర్చులపై ప్రైవేటు వ్యక్తులతో ఆడిటింగ్ కు హైకోర్టు నో

  • సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం
  • మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ
  • ప్రధాన వ్యాజ్యంపై వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని హామీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేస్తున్న ఖర్చులపై ప్రైవేటు వ్యక్తులతో ఆడిట్‌ చేయించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.  బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తిలతో కూడిన బెంచ్‌ నిన్న విచారించింది.

తిరుమల, తిరుచానూరు లతోపాటు మరో 11 ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ తప్పించాలని కోరుతూ సుబ్రహ్మణ్యస్వామితోపాటు ఢిల్లీకి చెందిన సత్యపాల్‌ సబర్వాల్‌లు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఆలయాలపై ప్రభుత్వానికి అధికారాలను కల్పిస్తున్న హిందూ ధార్మిక సంస్థ, దేవాదాయ చట్టంలోని పలు సెక్షన్‌లను రద్దు చేయాలని వీరు కోరారు. అదే సమయంలో గడచిన మూడేళ్లలో టీటీడీ చేసిన వ్యయాలపై ప్రైవేటు వ్యక్తులతో ఆడిట్‌ చేయించేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

పిటిషన్‌ పరిశీలించిన న్యాయమూర్తులు ఫిటిషనర్‌ అభ్యర్థనను తోసిపుచ్చుతూ ప్రధాన వ్యాజ్యాన్ని వేసవి సెలవుల అనంతరం విచారిస్తామని స్పష్టం చేశారు. ఆ విధంగా కేసు విచారణకు వచ్చేలా చూడాలని న్యాయమూర్తులు రిజిస్ట్రీని ఆదేశించారు. ఇదే అంశంపై గతంలో సుప్రీం కోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ పరిశీలించిన కోర్టు టీటీడీ స్థానిక చట్టాల ఆధారంగా పనిచేస్తున్నందున తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

కావాలంటే హైకోర్టును ఆశ్రయిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అప్పట్లో స్పష్టం చేసింది. దీంతో సుబ్రహ్మణ్యస్వామి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అదే సమయంలో టీటీడీలో భారీగా అక్రమాలు జరిగాయని, వాటిని వెలికి తీసేందుకు ప్రైవేటు వ్యక్తులతో ఆడిట్‌కు అనుమతించాలంటూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News