Andhra Pradesh: దేశమంతా రైళ్లలో బాంబులు పెట్టారు.. అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్.. పరుగులు పెట్టిన పోలీసులు!
- కర్ణాటక పోలీసులకు అజ్ఞాత వ్యక్తి ఫోన్
- ఏపీ, తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేసిన కర్ణాటక డీజీపీ
- రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం
శ్రీలంకలో ఇటీవల ఉగ్రవాదులు పెను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడెక్కడ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో అని భారత్ లో అన్ని రాష్ట్రాల పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఈరోజు కర్ణాటక పోలీసులకు ఫోన్ చేశాడు.
దేశవ్యాప్తంగా కొన్ని రైళ్లలో ఉగ్రదాడులకు ముష్కరులు ప్రణాళికలు వేస్తున్నారని చెప్పాడు. ఇందులో భాగంగా పలు రైళ్లలో బాంబులు పెట్టారని వ్యాఖ్యానించాడు. అయితే తన వివరాలను ఇవ్వడానికి మాత్రం నిరాకరించాడు. ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక డీజీపీ వెంటనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, గోవా, పుదుచ్చేరి, మహారాష్ట్ర డీజీపీలకు సమాచారం అందించారు.
దీంతో ఉన్నతాధికారులు పోలీసులకు, రైల్వే సిబ్బందికి హెచ్చరికలు జారీచేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు రైల్వే స్టేషన్లలో తనిఖీలను ముమ్మరం చేశారు. మరోవైపు ఈ ఫోన్ కాల్ ను ట్రేస్ చేసిన కర్ణాటక పోలీసులు, దీనిని నకిలీ ఫోన్ కాల్ గా గుర్తించారు. మాజీ ఆర్మీ ఉద్యోగి అయిన ఓ వ్యక్తి ఈ నిర్వాకానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు, ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.