Road Accident: గృహప్రవేశానికి రెండు రోజుల ముందు విషాదం.. రోడ్డు ప్రమాదంలో యజమాని దుర్మరణం
- కొత్తింటిలో ఏర్పాట్లు చూసేందుకు వెళ్తుండగా ఘటన
- మోటారు సైకిల్‌ను ఢీకొట్టిన లారీ
- మరొకరు కూడా మృతి
సొంతింటి కల నెరవేరుతున్నందుకు అతను ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అతన్ని పొట్టన పెట్టుకుంది. ఆ ఇంట తీవ్ర విషాదం నింపింది.
వివరాల్లోకి వెళితే...మేడ్చల్ జిల్లా నిర్మల్ పట్టణం ద్యాగవాడ కాలనీకి చెందిన సాదు హరీష్‌కుమార్ (38) ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సౌజన్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చింతల్‌లోని గణేష్‌నగర్‌లో నివాసం ఉంటున్న హరీష్ గుండ్లపోచంపల్లి పరిధిలోని కె.వి.రెడ్డి నగర్‌లో సొంతింటిని నిర్మించుకున్నాడు. ఈనెల 29వ తేదీ సోమవారం గృహప్రవేశానికి ముహూర్తంగా నిర్ణయించడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాడు.
నిర్మల్‌లోనే ఉంటున్న హరీష్ అన్న చంద్రశేఖర్ గృహప్రవేశం కోసం తమ్ముడు ఇంటికి కుటుంబంతో కలిసి వచ్చాడు. సోదరుడి కుమారుడు సిద్ధార్థ (14)తో కలిసి హరీష్ నిన్న సాయంత్రం ద్విచక్ర వాహనంపై కొత్తింటికి వెళ్తున్నాడు. కొంపల్లి వంతెనపై వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో హరీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సిద్ధార్థ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
గృహప్రవేశం నేపథ్యంలో బంధువులతో కళకళలాడుతున్న ఇంట్లో ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదం అలముకుంది. వేసవి సెలవులు కావడం, శుభకార్యం ఉండడంతో బాబాయ్ ఇంటికి ఎంతో సంతోషంగా వచ్చిన సిద్ధార్థ ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం.