Andhra Pradesh: మోదీపై పోటీకి తెలుగు రైతులు.. చుక్కలు చూపిస్తున్న బీజేపీ నేతలు, ఇంటెలిజెన్స్ అధికారులు!
- ఇప్పటికే వారణాసికి చేరుకున్న తెలుగు రైతులు
- ప్రతిపాదకులను బెదిరిస్తున్న యూపీ బీజేపీ నేతలు
- అడుగడుగునా అడ్డుకుంటున్న ఇంటెలిజెన్స్ అధికారులు
పంటలకు మద్దతు ధర కల్పించకపోవడం, పసుపు బోర్డును ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ రైతులు వారణాసిలో ప్రధాని మోదీపై పోటీకి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. వీరంతా వారణాసికి చేరుకుని నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అక్కడి ప్రభుత్వ అధికారులు, పోలీసులు మాత్రం వీరిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు.
వీరికి తోడుగా స్థానిక బీజేపీ నేతలు తెలంగాణ రైతులకు అక్కడ ప్రతిపాదకులు దొరకకుండా చేసేశారు. రైతులకు మద్దతు ఇచ్చే స్థానికులను బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని రైతు నాయకుడు నర్సింహనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి నామినేషన్ వేయాలంటే కొంతమంది స్థానికులు వారి పేర్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది. తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు రైతులు కూడా ప్రస్తుతం వారణాసిలో మోదీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా, తెలంగాణ, ఏపీ, తమిళనాడు రైతులను యూపీ ఇంటెలిజెన్స్ అధికారులు నీడలా వెంటాడుతున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ లోక్ సభ స్థానం తరహాలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడం ద్వారా తమ సమస్యలు జాతీయ స్థాయిలో వెలుగులోకి వస్తాయనీ, తద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశగా ఉన్నారు. కానీ యూపీ ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం.. మీరంతా ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాల్సిన అవసరం ఏంటి? మీరంతా రైతులా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని రైతు నేత నర్సింహనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
తాము వారణాసికి వచ్చినా తమిళ రైతులు రాకుండా అన్నాడీఎంకే ప్రభుత్వం ఆరుగురు రైతుల నేతలను అరెస్ట్ చేసిందన్నారు. అయినా వారంతా ఈరోజు సాయంత్రానికల్లా వారణాసికి చేరుకుంటారని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రధాని మోదీపై పోటీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.