Telangana: ఈ నెల 29న ‘చలో ఇంటర్ బోర్డు’ నిర్వహిస్తాం.. ఎవరు అడ్డుకున్నా ఆగబోం!: టీజేఎస్ చీఫ్ కోదండరాం
- బోర్డు నిర్లక్ష్యం కారణంగా 23 మంది బలయ్యారు
- కేసీఆర్ తీరిగ్గా స్పందించడం బాధ్యతారాహిత్యమే
- హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కోదండరాం
తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 23 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అలసత్వం వద్దని అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు ఎంతగా హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇంటర్ బోర్డు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 29న విపక్ష పార్టీలతో కలసి ‘చలో ఇంటర్ బోర్డు’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడారు.
ఎవరు అడ్డుకున్నా ‘చలో ఇంటర్ బోర్డు’ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని కోదండరాం స్పష్టం చేశారు. పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు తీసుకున్న అనంతరం, 5-6 రోజుల తర్వాత సీఎం కేసీఆర్ తీరిగ్గా స్పందించడం దారుణమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏ ఒక్క పరీక్షను కూడా ప్రభుత్వం సక్రమంగా నిర్వహించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.