Fani: మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'ఫణి'
- తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
- గంటకు 45 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు పయనం
- ఈ నెల 30 నాటికి ఏపీ తీరానికి సమీపంగా వచ్చే అవకాశం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం ఈ మధ్యాహ్నం తుపానుగా మారింది. దీనికి బంగ్లాదేశ్ సూచించిన 'ఫణి' అనే పేరు పెట్టారు. ఇది రాబోయే 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ విభాగం చెబుతోంది. ప్రస్తుతం గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 30 నాటికి తమిళనాడు, ఏపీ తీరాలకు రానుంది.
అయితే, తీరం ఎక్కడ దాటుతుందన్న విషయంలో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ కచ్చితమైన సమాచారం లేదు. ఏపీ తీరం వెంబడి పయనించే సమయంలో 'ఫణి' పెను తుపానుగా ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇప్పటికే తమిళనాడు, ఏపీల్లో మత్స్యకారులకు హెచ్చరికలు జారీచేశారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లినవారు ఏప్రిల్ 28 లోగా తీరానికి చేరుకోవాలంటూ స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంపై ఫణి ప్రభావం ఏప్రిల్ 29 నుంచి ఉంటుందని అంచనా.