IPL: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల సమయాల్లో మార్పు.. ఇక అరగంట ముందే మ్యాచ్‌లు
- మ్యాచ్‌లు అర్ధరాత్రి వరకు కొనసాగుతుండడంపై విమర్శలు
- ప్లేఆఫ్స్‌ను సాయంత్రం 7:30కే ప్రారంభించాలని నిర్ణయం
- బీసీసీఐ నిర్ణయానికి సీవోఏ గ్రీన్ సిగ్నల్
ఉత్సాహంగా సాగుతున్న ఐపీఎల్ మ్యాచులు ప్లే ఆఫ్స్ దశకు చేరుకున్నాయి. వచ్చే నెల ఏడో తేదీ నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. అయితే, వీటి వేళలను అరగంట ముందుకు జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి సుప్రీంకోర్టు నియమిత పాలకమండలి కూడా ఓకే చెప్పింది. దీంతో రాత్రి 8 గంటలకు జరగాల్సిన మ్యాచ్‌లు 7:30 గంటలకే ప్రారంభం కానున్నట్టు బీసీసీఐ తెలిపింది.
8 గంటలకు ప్రారంభమవుతున్న మ్యాచ్‌లు అర్ధరాత్రి వరకు సాగుతుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం పాలకమండలి (సీవోఏ)తో బోర్డు చర్చించింది. బోర్డు నిర్ణయానికి సీవోఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. వచ్చే నెల 7న చెన్నైలో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుండగా, 8, 10వ తేదీల్లో ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లు విశాఖపట్టణంలో జరుగుతాయి. మే 12న జరిగే ఫైనల్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది.