Diksuchi: మాకు థియేటర్లు ఇవ్వడం లేదు.. తెలంగాణలో మూడే థియేటర్లు... వాపోయిన 'దిక్సూచి' హీరో దిలీప్!
- ఇటీవల విడుదలైన 'దిక్సూచి'
- సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయన్న హీరో
- థియేటర్లు ఇవ్వడం లేదని ఆవేదన
'అవెంజర్స్ ఎండ్ గేమ్' వంటి సినిమాతో పోటీపడి థియేటర్లకు వచ్చిన 'దిక్సూచి' చిత్రం చాలా బాగుందని విమర్శకులు వ్యాఖ్యానించారని, అయినా, తమ చిత్రానికి థియేటర్లు లభించని పరిస్థితి నెలకొందని సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన దిలీప్ కుమార్ సల్వాది వాపోయాడు. నైజాంలో కేవలం మూడు థియేటర్లు మాత్రమే తమకు లభించాయని, మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 65 థియేటర్లు దొరికాయని, సినిమా హిట్ అని, ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారని, అయినా, అదనపు థియేటర్లు ఇవ్వడం లేదని ఆయన విమర్శించాడు.
ఎగ్జిబిటర్లు ఎందుకు థియేటర్లు ఇవ్వడం లేదని ప్రశ్నించిన ఆయన, ఈ పరిస్థితి తనకు బాధిస్తోందని, హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లలో తన సినిమాకు అవకాశం ఇస్తే మైలేజ్ వస్తుందని అన్నారు. థియేటర్లు ఇవ్వనందుకు తాను ఎవరినీ నిందించబోనని, పాజిటివ్ టాక్ వచ్చిన తరువాత కూడా ఇబ్బందులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. తెలుగు గడ్డపై తెలుగువాడికి అవకాశం ఇవ్వడం లేదని విమర్శించిన ఆయన, తాము రచ్చ గెలిచి ఇంట ఓడిపోయినట్టు అయిందని వాపోయారు.
'దిక్సూచి'కి హైదరాబాద్ లో 2, నాగర్ కర్నూల్ లో ఒక్క థియేటర్ మాత్రమే దొరికిందని, మిగతా ఎక్కడా సినిమా విడుదల కాలేదని చెప్పిన ఆయన, ఎక్కువ థియేటర్లలో రిలీజైతే నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్టే సత్తా సినిమాకు ఉందని, సినిమా బాగున్నా నిర్మాతల కళ్లలో ఆనందం చూడలేకపోతున్నానని దిలీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.