Lok Sabha: సాధ్విని బరిలోకి దింపి బీజేపీ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడింది: ఎన్సీపీ
- రాఫెల్ కుంభకోణం, ఉద్యోగాల తీసివేతను ప్రజలు మర్చిపోతారని బీజేపీ భావిస్తోంది
- బీజేపీకి 220 సీట్లకు మించి రావు
- అక్షయ్ కుమార్‌తో మోదీ ఇంటర్వ్యూ ప్రచార ఆర్భాటమే
మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను పోటీలో నిలబెట్టి బీజేపీ వ్యూహాత్మక తప్పిదం చేసిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర అవహద్ పేర్కొన్నారు. భోపాల్ నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్‌పై ప్రజ్ఞాసింగ్‌ను బీజేపీ పోటీకి దించింది. మోదీ ప్రభుత్వంలోని లోపాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ సాధ్విని బరిలోకి దింపిందని ఆయన ఆరోపించారు.
‘‘సాధ్విని బరిలోకి దింపి బీజేపీ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడింది. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుంది. లౌకికదేశంలో రైట్ వింగర్లను, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిని ప్రజలు అంగీకరించరు’’ అని ఆయన పేర్కొన్నారు. రాఫెల్ కుంభకోణాన్ని ప్రజలు మర్చిపోయారని బీజేపీ భావిస్తోందని విమర్శించారు.
పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, ఉద్యోగాల తీసివేత వంటి విషయాలను ప్రజలు మర్చిపోతారని, కరుడుగట్టిన హిందూత్వ వాదులంతా బీజేపీకే మద్దతు పలుకుతారన్న భ్రమలో బీజేపీ ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రోజువారీ విషయాలపై మోదీ మాట్లాడడమే మానేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో మోదీ ఇంటర్వ్యూ ప్రచార ఆర్భాటం తప్పమరేమీ కాదని కొట్టిపడేశారు.