Uttar Prades: వారణాసిలో ప్రధాని మోదీ ఏం చేశారయ్యా అంటే..!: వివరించిన ప్రియాంక గాంధీ
- వారణాసిలో మోదీ 15 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు
- కాశీలో ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఇదే
- మోదీ ఎప్పుడైనా ఓ పేదవాడి ఇంటికెళ్లడం మీరు చూశారా?
నాలుగో విడత ఎన్నికల ప్రచారం చివరి రోజున ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నేత, తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మోదీపై సునిశిత విమర్శలు చేశారు. రైతులను ఉద్దేశించి ప్రియాంక మాట్లాడుతూ.. మోదీ ఐదేళ్ల పాలనలో చేసిందేమీ లేదన్నారు. తాను ప్రచారం చేసిన ప్రతీ చోట ఈ ఐదేళ్లలో తాము అనుభవించిన కష్టాలను ప్రజలు తనతో ఏకరవు పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాల పెండింగ్, ధరల క్షీణతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనికితోడు నోట్ల రద్దుతో మరిన్ని సమస్యలను ప్రజల నెత్తిన రుద్దారని ఆరోపించారు.
మోదీ ఇటీవల ఇంటర్వ్యూల ద్వారా టీవీల్లో కనిపిస్తున్నారని ఎద్దేవా చేసిన ప్రియాంక.. మోదీ లగ్జరీ గార్డెన్లలోనో, లేదంటే వారణాసి ఘాట్లలో గంగా హారతి చూస్తూనో కనిపిస్తుంటారని అన్నారు. మోదీ ఎప్పుడైనా ఓ పేదవాడి ఇంటికి వెళ్లడం చూశారా? అని ప్రశ్నించారు. దేశం ముందుకెళ్తోందని ఊదరగొడుతున్నారని, కానీ ఈ ఐదేళ్లలో మోదీ వారణాసిలో కేవలం 15 కిలోమీటర్ల మేర రోడ్‌షో మాత్రమే నిర్వహించారని విమర్శించారు. అది కూడా విమానాశ్రయం నుంచి నగరంలోకి మాత్రమేనని మండిపడ్డారు. వారణాసిలో ఈ ఒక్క అభివృద్ధి తప్ప మరేమీ కనిపించలేదని ప్రియాంక విరుచుకుపడ్డారు.