Crime News: సంపన్న కుటుంబం... అయినా చోరీలే అతని మార్గం.. దారితప్పిన గ్రాడ్యుయేట్!
- లక్షల్లో ఆదాయం వచ్చే కుటుంబమైనా అడ్డదారిలో ప్రయాణం
- ఇంట్లో వారు అంగీకరించక పోవడంతో బయటకు
- ప్రియురాలితో జల్సాల కోసం దొంగతనాలు
చదువు, తెలివితేటలు, సంపన్న కుటుంబం ఆసరా అన్నీ ఉన్నా అడ్డదారిలో ప్రయాణమే తనకు నచ్చిందన్న రీతిలో ఓ పట్టభద్రుడు చెలరేగిపోయాడు. జల్సాల కోసం దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. చిన్నవయసులోనే గజ దొంగగా మారి చివరికి పోలీసులకు చిక్కాడు. పేరుమోసిన దొంగ ఘన్శ్యామ్ బల్వీర్సింగ్ అలియాస్ బల్లు (27) నేర చరిత్ర వింటే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పశ్చిమ మండలం డీసీపీ తెలిపిన వివరాలు ఇలావున్నాయి. సుల్తాన్ బజార్లోని బడీచౌడీ చౌదరీబాగ్కు చెందిన బల్వీర్సింగ్ ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. వీరి కుటుంబానికి కాచిగూడలో లక్షల్లో అద్దెలు వచ్చే పలు భవనాలున్నాయి. కంపూటర్స్లో బీకాం చదివాడు. ఏదైనా ఉద్యోగమో, వ్యాపారమో చేసుకుని హాయిగా జీవించాలన్న కుటుంబ సభ్యుల సలహా అతనికి రుచించలేదు. జల్సాలతో డబ్బు దుబారా చేస్తుండడంతో భరించలేక కుటుంబ సభ్యులు కూడా అతన్ని ఇంటికి దూరం పెట్టారు.
అప్పటికి పూణేలో ఎంబీఏ చదువుతున్న ఓ యువతితో నిండా ప్రేమలో మునిగి తేలుతున్న బల్వీర్సింగ్కు కుటుంబ సభ్యుల నిరాదరణ పెద్ద షాక్ అయింది. ప్రియురాలిని సంతోష పెట్టడం, ఆమెతో కలిసి చేసే జల్సాలకు అలవాటు పడడంతో అతనికి పెద్దమొత్తం డబ్బు అవసరమయ్యేది. కొన్నాళ్లు అప్పు చేసుకుంటూ నెట్టుకు వచ్చాడు. ఆ మార్గాలు మూసుకుపోవడంతో దిక్కుతోచని స్థితిలో చోరీలు మొదలు పెట్టాడు.
సంపన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు, చోరీలు మొదలు పెట్టాడు. చివరికి గజదొంగగా మారాడు. వరుస చోరీలతో హడలెత్తిస్తుండడంతో పోలీసులు నిందితుని కోసం గాలించడం మొదలు పెట్టారు. చివరికి ఎస్సార్ నగర్ పోలీసులకు బల్వీర్సింగ్ చిక్కడంతో అతని వద్ద నుంచి రూ.15 లక్షల విలువ చేసే అర కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.