Andhra Pradesh: జమ్మలమడుగులో ఇసుక మాఫియా బీభత్సం.. ఏకంగా పోలీసులపైనే దాడి!
- అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసులకు సమాచారం
- తనిఖీలకు వెళ్లి అడ్డుకున్న పోలీసులు
- కర్రలు, పారలతో అధికారులపైనే దాడి
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఈరోజు ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకున్నందుకు పోలీస్ అధికారులనే చితకబాదింది. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడగా, పలువురికి గాయాలయ్యాయి. జమ్మలమడుగు శివారులో ఇసుకను కొందరు అక్రమంగా తరలిస్తున్నట్లు ఈరోజు పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడికి వెళ్లగా, ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా సభ్యుడు ‘ఎంత ధైర్యం ఉంటే మా ట్రాక్టర్ ను ఆపుతారు?’ అని విరుచుకుపడ్డారు.
ట్రాక్టర్లలోని కర్రలు, పారలతో దాడికి దిగారు. ఈ ఘటనలో వీరాంజనేయులు అనే కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి చేసిన అనంతరం ఇసుక మాఫియా సభ్యులు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.