Andhra Pradesh: ఏపీలో గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలే లేవు.. అంతా అల్లాడిపోతున్నారు!: సి.రామచంద్రయ్య
- బాబు పాలనలో అప్పు రూ.2 లక్షల కోట్లకు చేరింది
- ఇష్టానుసారం ఆయన అప్పులు చేశారు
- అమరావతిలో మీడియాతో వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వైసీపీ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏపీ మరింతగా దిగజారిపోయిందని దుయ్యబట్టారు. ఏపీ అప్పులు ప్రస్తుతం రూ.2 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆరోపించారు. వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సి.రామచంద్రయ్య మాట్లాడారు.
టీడీపీ పాలనలో ప్రభుత్వ నిధులకు, సొంత నిధులకు తేడా లేకుండా పోయిందని రామచంద్రయ్య మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించి మరీ చంద్రబాబు అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ అప్పులను ఎవరికోసం, ఎందుకు చేశారో చంద్రబాబు చెప్పలేదని ఆరోపించారు. ప్రజల కోసం కాకుండా సొంత ఆస్తులను పెంచుకునేందుకే చంద్రబాబు ఐదేళ్లు పనిచేశారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం టీడీపీ ప్రభుత్వ అవినీతిని బయటకు తీస్తుంటే తప్పేముందని ప్రశ్నించారు.
ఏపీలో ఆర్థిక స్థితిగతులపైన, ప్రస్తుత పరిస్థితులపైనా సీఎస్ సమీక్ష చేస్తే సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ బడ్జెట్ లో ఓ క్రమ పద్ధతి లేకుండా పోయిందన్నారు. అన్ని నిబంధనలను తుంగలో తొక్కిన చంద్రబాబు ఇష్టానుసారం భారీ వడ్డీలకు అప్పులను తీసుకొచ్చారని పునరుద్ఘాటించారు. అసలు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబుకు అంత కోపం ఎందుకని రామచంద్రయ్య ప్రశ్నించారు.