Andhra Pradesh: అమరావతి పంటపొలాల దహనం కేసును అంత సులభంగా వదిలిపెట్టబోం!: వైసీపీ నేత నందిగం సురేశ్ హెచ్చరిక
- వాస్తు కోసమే బాబు రోడ్డు వేయించారు
- అధికారులు ఆయనకు తొత్తులుగా మారారు
- విజయవాడలో మీడియాతో వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ రైతు గద్దె మీరాప్రసాద్ పొలంలో రోడ్డు వేయించారని వైసీపీ నేత నందిగం సురేశ్ ఆరోపించారు. వాస్తు కోసమే చంద్రబాబు ఈ పనిచేశారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో రైతులను పోలీసులు, అధికారులు వేధించడం కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. అధికారులంతా చంద్రబాబు తొత్తులుగా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో నందిగం సురేశ్ మాట్లాడారు.
రైతు మీరాప్రసాద్ కు వైసీపీ అండగా నిలుస్తుందని సురేశ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయనకు న్యాయం చేస్తామన్నారు. గతంలోనూ రాజధాని ప్రాంతంలోని పంటపొలాలను రెవెన్యూ అధికారులు, పోలీసులు తగలబెట్టారని ఆరోపించారు. తుళ్లూరు డీఎస్పీ కేశప్ప, ఏడీసీ, ఎమ్మార్వో పద్మావతి.. వీళ్లంతా టీడీపీ నేతలతో కుమ్మకై రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి పంటపొలాల దహనం కేసును అంత సులభంగా వదిలిపెట్టబోమని నందిగం సురేశ్ వ్యాఖ్యానించారు. ఈ కేసును మళ్లీ తెరిపించి పంటపొలాలను దహనం చేసిన దోషులను పట్టుకుంటామని హెచ్చరించారు. మే 23న చంద్రబాబు దుర్మార్గపు పాలన అంతమై రాజన్న రాజ్యం వస్తుందని జోస్యం చెప్పారు.