Telangana: గ్లోబరినా సంస్థ పేరును మొదటిసారి వింటున్నా.. నేను రాజ్యాంగేతర శక్తిని కాదు!: టీఆర్ఎస్ నేత కేటీఆర్
- ఈరోజు ట్విట్టర్ లో కేటీఆర్ ముచ్చట్లు
- పలు ప్రశ్నలు సంధించిన నెటిజన్లు
- ఓపిగ్గా జవాబిచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈరోజు నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం ఎదురయింది. ఏ ప్రశ్నలనైనా తనను అడగాలని కేటీఆర్ కోరగా, ట్విట్టర్ లో పలువురు వ్యక్తులు వేర్వేరు అంశాలపై కేటీఆర్ తో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఓ నెటిజన్ కేటీఆర్ వ్యవహారశైలిపై స్పందిస్తూ..‘కేటీఆర్.. మీకు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పదవి లేనప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడాన్ని మీరు విధిగా భావిస్తున్నారా? ప్రభుత్వం సాధించిన విజయాలకు కలెక్టర్లు తమ ట్వీట్ లలో మిమ్మల్ని ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు? మీరు రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తున్నారా? ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన గ్లోబరినా వ్యవహారంలో మీ పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై ఏమైనా మాట్లాడుతారా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.
దీనికి కేటీఆర్ నింపాదిగా సమాధానం ఇచ్చారు. ‘నేను ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని. కాబట్టి ఆ అధికారంతోనే ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళుతున్నా. ఇక గ్లోబరినా వ్యవహారం అంటారా.. ఇంటర్ ఫలితాల తర్వాత వివాదం చెలరేగినప్పుడే దాని పేరును తొలిసారి విన్నాను. అప్పటివరకూ దాని గురించి కూడా నాకు తెలియదు’ అని ట్వీట్ చేశారు. తాను హైదరాబాద్ లో ఉద్యోగం చేయాలనుకుంటున్నానని కర్ణాటకకు చెందిన ఓ ఇంజనీరింగ్ యువకుడు కోరగా, దేశంలో ఎవరు ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చనీ, తెలంగాణలో చాలామంది కన్నడిగులు ప్రశాంతంగా, హయిగా బతుకుతున్నారని స్పష్టం చేశారు.